విజయవాడ: వికసిత్ భారత్ లబ్ధిదారులు ప్రస్తుత యువతేనని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్పష్టం చేశారు. విజయవాడలో భారతీయ జనతా యువమోర్చా (BJYM) ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించిన యువ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువశక్తి, నారీశక్తి, కిసాన్ శక్తి మరియు గరీబ్ కల్యాణ్ అనేవి వికసిత్ భారత్‌‌కు నాలుగు ప్రధాన మూలస్తంభాలని అభివర్ణించారు. గతంలో చాలామంది పేదలకు బ్యాంకు ఖాతాలు కూడా లేవని, కానీ ప్రధాన మంత్రి మోదీ ప్రభుత్వ హయాంలో జనధన్ ఖాతాలు అందుబాటులోకి వచ్చాయని గుర్తుచేశారు.

యువత రాజకీయాల్లోకి ప్రవేశించడంపై స్పందిస్తూ.. 40 ఏళ్ల వయసు తరువాత యువత పాలిటిక్స్‌లోకి రావాలని పిలుపునిచ్చారు. జీవితంలో తగిన అనుభవం, స్థిరత్వం సంపాదించుకున్న తర్వాతే రాజకీయ రంగప్రవేశం చేయాలని సూచించారు. దేశంలో ప్రస్తుతం 50 శాతం మంది యువత ఉన్నారని, పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న యువత దేశానికి చాలా అవసరమని చెప్పారు. పాలసీలు తయారు చేయగలిగేలా, మెరుగైన ఫలితాలు సాధించేలా యువత ఎదగాలని.. భవిష్యత్ ఆంత్రప్రెన్యూర్లు, పాలసీ మేకర్స్, రాజకీయ నాయకులుగా రాణించాలని ఆకాంక్షించారు. బాధ్యతాయుతంగా, దేశం కోసం పనిచేసే తత్వంతో పాటు పారదర్శకత కలిగి ఉండాలని కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణం, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో గొప్ప విజన్‌తో ముందుకు వెళ్తున్నారని కొనియాడారు.

పాలిటిక్స్ గురించి యువత ఆలోచించాలి: పీవీఎన్ మాధవ్

ఈ కార్యక్రమంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ.. 2047 నాటికి భారత్‌ను పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల కలలను సాకారం చేయాల్సిన బాధ్యత యువతపై ఉందని, దేశ రాజకీయాల గురించి ప్రతి యువకుడు ఆలోచించాలని సూచించారు. ప్రధాని మోదీ ప్రయాణం దేశంలోని ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని, ఎయిర్, రోడ్, వాటర్ కనెక్టివిటీలను సమర్థవంతంగా అభివృద్ధి చేశారని తెలిపారు.

వీఐ (విలేజ్ ఇంటిలిజెన్స్) ఏఐ కంటే బలమైనది: ఎమ్మెల్యే సుజనా చౌదరి

శాసనసభ్యులు సుజనా చౌదరి మాట్లాడుతూ.. నేటి యువత ప్రతి రంగంలోనూ ఎంతో ముందుంటోందని ప్రశంసించారు. 'VI' అంటే విలేజ్ ఇంటిలిజెన్స్ అని, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంటే చాలా బలమైనదని అభివర్ణించారు. హ్యూమన్ ఇంటిలిజెన్స్ (HI), పొలిటికల్ ఇంటిలిజెన్స్ (PI) లలోనూ మనం అద్భుతమైన ప్రగతి సాధించామన్నారు. ప్రధాని మోదీ లక్ష్యానికి అనుగుణంగా 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో విద్యార్థులు లీడర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. యువత పబ్ కల్చర్ వంటి వాటికి దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన అంశాలపై దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు.

Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 22 Aug 2026 | 05:11 PM IST
Tags: