తిరుపతి: స్విమ్స్‌ ఆస్పత్రి ద్వారా పేద రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలందించడానికి నిరంతరం కృషి చేస్తానని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) నూతన డైరెక్టర్, వీసీ డాక్టర్ గుడారు జగదీష్ స్పష్టం చేశారు. స్విమ్స్‌ నూతన డైరెక్టర్‌గా గురువారం ఉదయం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బర్డ్‌, స్విమ్స్‌ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వేదపండితుల నుంచి ఆశీర్వచనాలు పొందారు.

బాధ్యతల స్వీకరణ అనంతరం డాక్టర్ జగదీష్ మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ సహకారంతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు, ముఖ్యంగా గిరిజన (ట్రైబల్) ఏరియాల్లో స్విమ్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. స్విమ్స్‌లో నిష్ణాతులైన వైద్యుల బృందం అందుబాటులో ఉందని, వారి సేవలతో ఈ ఆస్పత్రిని రాష్ట్రంలోనే అత్యుత్తమ వైద్య కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. మరో ఆరు నెలల కాలంలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రజలకు అందుబాటులోకి రానుందని వెల్లడించారు. అంతేకాకుండా రోగుల అత్యవసర సేవల కోసం ఆస్పత్రి భవనంపై ఎయిర్‌ అంబులెన్సు దిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. స్విమ్స్‌లో ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు బ్లడ్ బ్యాంకు సేవలను విస్తృతం చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్విమ్స్‌ ఎంఎస్‌ డాక్టర్ రామ్‌, సీనియర్‌ సీఎంవో శివశంకర్‌, మెడిసన్‌ విభాగాధిపతి డాక్టర్ అల్లాడి మోహన్‌, డాక్టర్ అలోక్‌సచిన్‌, దిలీప్‌, రేడియాలజీ విభాగాధిపతి శిల్ప, సీఎంవో డాక్టర్ భారతి, డాక్టర్ వనజ, డాక్టర్ పాల్‌, ఆర్‌ఎంవో డాక్టర్ కోటిరెడ్డి, బర్డ్‌ ఆర్‌ఎంవో వెంకారెడ్డి తదితరులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

టీటీడీ చైర్మన్‌తో భేటీ

గురువారం మధ్యాహ్నం తిరుమలకు వెళ్లిన డాక్టర్ జగదీష్‌.. టీటీడీ చైర్మన్, స్విమ్స్‌ ఛాన్సలర్‌ బి.ఆర్. నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన జాయినింగ్‌ రిపోర్టును చైర్మన్‌కు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. డాక్టర్ జగదీష్ స్విమ్స్‌లో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. గతంలో స్విమ్స్‌లో సేవలపై కొన్ని విమర్శలు వచ్చాయని, అపార అనుభవజ్ఞుడైన జగదీష్ ఆ లోపాలను సరిదిద్దగలరని నమ్మకం ఉందన్నారు. అనంతరం డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ.. తిరుపతిని ఇంటిగ్రేటెడ్ మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని, ఎన్టీఆర్‌ వైద్యసేవలను మరింత విస్తరించి పేద రోగులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తామని స్పష్టం చేశారు.

Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 28 Aug 2026 | 02:25 AM IST
Tags: