విశాఖపట్నం, ఆగస్టు 27: రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసే రేషన్ సరుకుల జాబితా నుంచి వచ్చే నెల నుంచి రాగులను తొలగించారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి రెండు నెలలపాటు కార్డుకు మూడు కిలోలు చొప్పున రాగులు పంపిణీ చేసిన అధికారులు, ఆ తర్వాత రెండు నెలలపాటు నిలిపివేశారు. తిరిగి మే నెలలో పంపిణీ చేసి, జూన్ నుంచి మళ్లీ సరఫరా నిలిపివేశారు. గోదాముల్లో మిగిలిన కొద్దిపాటి రాగులను మాత్రమే ఆగస్టు నెలలో కొందరు కార్డుదారులకు అందజేశారు.

సెప్టెంబరు నెలకు సంబంధించి రాగులను పౌర సరఫరాల సంస్థ సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో జిల్లాకు స్టాక్ రాలేదని డీలర్లు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 5.17 లక్షల బియ్యం కార్డులు ఉండగా, నిబంధనల ప్రకారం ప్రతినెలా మూడు కిలోల వంతున పంపిణీ చేయాలంటే సుమారు 1,500 టన్నుల రాగులు అవసరం. కానీ ఈ ఏడాది ప్రారంభం నుంచి కేవలం 300 నుంచి 400 టన్నులు మాత్రమే సరఫరా చేశారు. వాటిని డీలర్లు ముందుగా షాపులకు వచ్చిన కార్డుదారులకు పంపిణీ చేసేవారు. నగర ప్రాంతాల్లో చాలామంది వినియోగదారులు రాగులు తీసుకునేందుకు ఎక్కువగా మొగ్గుచూపేవారు. కాగా, సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కేవలం బియ్యం, పంచదార, గోధుమపిండి మాత్రమే పంపిణీ చేయనుండగా, ఇందుకు సంబంధించిన సరుకులు ఇప్పటికే రేషన్ డిపోలకు చేరాయి.

Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 28 Aug 2026 | 01:32 AM IST
Tags: