చిత్తూరు: రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు పూర్తిగా కళ్లెం వేసేందుకు ప్రభుత్వం సెప్టెంబరు నుంచి క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చిందని జిల్లా సరఫరా అధికారి (డీఎస్వో) వెంకట్రాముడు తెలిపారు. గురువారం చిత్తూరులోని మండల స్థాయి స్టాక్‌పాయింట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్యూఆర్‌ కోడ్‌ ముద్రించి ఉన్న బియ్యం బస్తాలను మాత్రమే రేషన్‌ డీలర్లు స్టాక్‌గా దించుకోవాలని స్పష్టం చేశారు. కోడ్‌ లేని బస్తాలను డీలర్లకు సరఫరా చేయకూడదని ఆదేశించారు.

సెప్టెంబరు నెల కోటా కింద మొత్తం తొమ్మిది వేల టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం జిల్లాకు కేటాయించిందని వివరించారు. ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద అన్ని బస్తాలకు క్యూఆర్‌ కోడ్‌ డిజిటల్‌ స్కానింగ్‌ పూర్తి చేశాకనే డీలర్లకు పంపిణీ చేయాలని, స్కానింగ్‌ చేయడంలో విఫలమైతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తనిఖీల్లో భాగంగా ఆయన కయనికట్టు వీధిలోని ఓ రేషన్‌ షాపును కూడా పరిశీలించారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాలో ఎక్కడైనా పట్టుబడితే.. ఆ బస్తా మీద ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్ చేసి సంబంధిత డీలర్‌ను గుర్తించి వెంటనే డీలర్‌షిప్‌ను రద్దు చేస్తామని తేల్చిచెప్పారు. అలాగే ప్రతినెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్దేశిత సమయాల్లో చౌక ధరల దుకాణాలను తప్పనిసరిగా తెరవాలని ఆదేశించారు.

Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 28 Aug 2026 | 01:58 AM IST
Tags: