చిత్తూరు: నెల రోజుల క్రితం కిలో చక్కెర ధర రూ.45 నుంచి రూ.50 మధ్య ఉండగా, గత వారం రోజులుగా ధర విపరీతంగా పెరుగుతూ ప్రస్తుతం రూ.70కి చేరింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే కిలోకు రూ.25 నుంచి రూ.30 వరకు ధర పెరగడంతో సామాన్యుల బడ్జెట్ తలకిందులవుతోంది. రాష్ట్రంలో బియ్యం కార్డుదారులున్న 4,81,056 మందికి మాత్రమే రేషన్ షాపుల్లో అరకిలో వంతున నగదుకు చక్కెర పంపిణీ చేస్తుండగా, మిగిలిన వారంతా బహిరంగ మార్కెట్లోనే అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఒక సాధారణ కుటుంబం నెలకు సుమారు రెండు కిలోల చక్కెరను వినియోగిస్తున్నట్లు అంచనా.
ఉదయం నిద్రలేవగానే కాఫీ, టీ తాగని వారు ఉండరు. దీనికితోడు రాబోయే రోజుల్లో వరుసగా వినాయక చవితి, దసరా, దీపావళి వంటి ప్రముఖ పండుగలు వస్తుండటంతో పిండివంటలు, మిఠాయిల తయారీకి చక్కెర తప్పనిసరి కానుంది. ఈ తరుణంలో ధరలు అకస్మాత్తుగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు..
రాష్ట్రంలో చక్కెర కర్మాగారాలు క్రమేణా తగ్గిపోవడం, చెరకు సాగు కనుమరుగవుతుండటంతో స్థానిక ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. దీంతో పంచదారను పూర్తిగా పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకూ ప్రధానంగా మహారాష్ట్ర నుంచి చక్కెర దిగుమతి అవుతుండగా, గత కొద్ది నెలలుగా అది కూడా నిలిచిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు ఇథనాల్ తయారీకి చెరకును పెద్దఎత్తున మళ్లిస్తున్నారన్న నివేదికలు ఉన్నాయి. ఇవన్నీ ఒకెత్తైతే, ఇదే అదునుగా భావిస్తున్న కొందరు అక్రమ వ్యాపారులు పాత స్టాక్‌ను గోదాముల్లో నిల్వ చేసి, కృత్రిమ డిమాండ్‌ను సృష్టిస్తూ బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తుండటమే ధరల పెరుగుదలకు అసలు కారణమని స్పష్టమవుతోంది. సంబంధిత అధికారులు స్పందించి కృత్రిమ కొరతను సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


