హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలను రద్దు చేసి, ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు తీవ్రస్థాయిలో ఆరోపించారు. రామంతాపూర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న ఆయనను తార్నాకలోని ఆయన నివాసంలో పోలీసులు గురువారం హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని రాంచందర్‌రావు మండిపడ్డారు. పాలిటెక్నిక్ కాలేజీలను కాపాడుకునేందుకు విద్యార్థులు చేస్తున్న పోరాటానికి బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ తమను గృహనిర్బంధం చేయడం ప్రభుత్వ అణచివేత ధోరణికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.


