విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రజల ప్రధాన ఆరోగ్య ప్రదాత అయిన కేజీహెచ్ (కింగ్ జార్జ్ హాస్పిటల్) మందుల కొరత సమస్యతో తీవ్రంగా సతమతమవుతోంది. ఆసుపత్రికి వచ్చే అవుట్‌ పేషెంట్లతో పాటు ఇన్‌పేషెంట్లుగా చేరిన రోగులకు ఉచితంగా అందించాల్సిన అనేక రకాల ప్రాణ రక్షక మందులు, ఇంజెక్షన్లు ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో వైద్యులు, సిబ్బంది రోగులను మందులు బయట కొనుగోలు చేసుకోవాలని సూచిస్తుండటంతో పేద రోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రధానంగా శస్త్రచికిత్సలు, ప్రసవ సమయాల్లో నొప్పుల నివారణకు ఇచ్చే బ్యూటర్‌ఫోనల్‌, మెదడు లేదా నాడీ సంబంధిత సమస్యలు, స్ట్రోక్ సందర్భాల్లో వాడే సిటికోలిన్, తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లకు వాడే క్లిండర్‌మైసిన్ (150 ఎంజీ), విటమిన్ కె లోపం, రక్తస్రావ నివారణకు ఇచ్చే మెనోడియన్ సోడియం బిసల్ఫైట్ కొరత తీవ్రంగా ఉంది. అలాగే థయమిన్ (1000 ఎంజీ) ఇంజెక్షన్, మూర్ఛ నియంత్రణకు వాడే లావెట్రాసిటెమ్, ఆపరేషన్ సమయాల్లో అనస్థీషియా కోసం ఇచ్చే ఫెంటాన్యల్, వాపు తగ్గించే సెరాపెప్టిడాజ్ (10 ఎంజీ) వంటి కీలక మందులు ఆసుపత్రిలో నిండుకున్నాయి.

ఇవే కాకుండా అధిక రక్తపోటు, టైప్ 2 డయాబెటిస్, గుండె, కిడ్నీ సంబంధిత దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారికి అత్యవసరంగా కావాల్సిన పలు రకాల మందులు కూడా స్టాక్‌లో లేవు. మొత్తం మీద సుమారు 50 రకాలకు పైగా ప్రాథమిక, అత్యవసర మందులు అందుబాటులో లేవని, వెంటనే వాటిని తెప్పించాలని ఆయా విభాగాధిపతులు, సిబ్బంది ఇప్పటికే అధికారులకు ఇండెంట్ పెట్టినప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదు. ప్రభుత్వ పెద్దాస్పత్రిలో ఉచిత వైద్యం అందక బయట కొనుగోలు చేయాల్సి వస్తోందని రోగులు, వారి బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్పందించి మందుల కొరతను నివారించాలని కోరుతున్నారు.

Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 28 Aug 2026 | 01:39 AM IST
Tags: