కవాడిగూడ: ఎస్సీ, ఎస్టీలకు వర్తింపజేస్తున్న విధంగానే రాష్ట్రంలోని బీసీ విద్యార్థులందరికీ పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం గట్టిగా డిమాండ్ చేసింది. అలాగే 42 శాతం బీసీ రిజర్వేషన్‌ బిల్లును తక్షణమే ఆమోదించాలని, రాబోయే మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ప్రత్యేకంగా సబ్‌ కోటా కేటాయించాలని కోరింది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద భారీ మహాధర్నా నిర్వహించారు.

ఈ మహాధర్నాకు శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌, హర్యానా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, బీసీ సంఘాల జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ తదితరులు ముఖ్య అతితులుగా హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. అధికారంలోకి వస్తే ఫీజు బకాయిలు వెంటనే చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మాట తప్పిందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోమని, ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పాండుయాదవ్‌, నాగుల శ్రీనివాస్‌యాదవ్‌, పర్వతనేని సతీశ్‌, కోల జనార్దన్‌, పిట్ల నాగేశ్‌, శ్రావణి, కుల్కచర్ల శ్రీనివాస్‌, శివమ్మ, అరుణ్‌యాదవ్‌, చీపురు మల్లేశ్‌, గోపి, ఉదయ్‌, సాంబశివగౌడ్‌, అంబాల నారాయణగౌడ్‌ తదితరులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 28 Aug 2026 | 02:56 AM IST
Tags: