హైదరాబాద్: గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో ఏడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామని, అంజయ్యనగర్‌లోని అన్ని అక్రమ నిర్మాణాలను తక్షణమే తొలగిస్తామని స్పష్టం చేశారు. అక్రమ కట్టడాల విషయంలో ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రమాద స్థలానికి సమీపంలో ఉన్న పక్క భవనాల వాళ్లు వెంటనే అప్రమత్తమై ఖాళీ చేసి వెళ్లాలని ఆదేశించారు.

నాలుగు నెలల క్రితమే సీజ్ చేశాం: కమిషనర్ సృజన

ఈ ఘటనపై సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన స్పందిస్తూ.. ఈ నిర్మాణాలపై గతంలోనే తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నాలాను ఆక్రమించి ఈ నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. సరిగ్గా నాలుగు నెలల క్రితమే ఈ నిర్మాణ పనులను ఆపివేయించి సీజ్ చేశామని వెల్లడించారు. అయితే, నిన్ననే మళ్లీ అక్రమంగా పనులు మొదలుపెట్టారని, ఈరోజు ఉదయం యజమానికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యామని, ఇంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని వివరించారు. ఈ బిల్డింగ్ చుట్టూ చాలా వరకు అక్రమ కట్టడాలు ఉన్నాయని, హాస్టల్ నిర్మాణం కోసం 7 అంతస్తులతో పాటు పెంట్‌హౌస్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. భవన యజమాని ఇంకా అందుబాటులోకి రాలేదని, పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

Read latest hyderabad News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 22 Aug 2026 | 05:00 PM IST
Tags: