రవీంద్రభారతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల్లోని పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదుగుతుంటే ఓర్వలేని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పూర్తిగా ఎత్తివేయడానికి కుట్ర పన్నుతున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు గురువారం బషీర్‌బాగ్ చౌరస్తాలో వందలాది మంది విద్యార్థులు, యువజన సంఘాల నేతలతో కలిసి భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ పాలకులు స్కాలర్‌షిప్‌లకు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు బడ్జెట్ లేదని సాకులు చెప్పడం వారి చేతకానితనానికి నిదర్శనమని తీవ్రంగా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇతర అన్ని అవసరాలకు, ఖర్చులకు నిధులు ఉంటున్నప్పుడు, పేద విద్యార్థుల చదువుల కోసం ఇచ్చే ఫీజు బకాయిలకు మాత్రం బడ్జెట్ ఎందుకు ఉండదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు సుమారు రూ. 4 లక్షల కోట్ల అప్పులు తెచ్చిన ప్రభుత్వం, ఆ నిధులతో రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేసిందో వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోబోమని, ఫీజు బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదలిపెట్టమని ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


