కర్నూలు: తరువులే ఇలలో ప్రధానమని, వృక్షాలను నాటడం మరియు రక్షించడం హిందూ సంస్కృతిలో అత్యున్నత ధర్మమని శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి మహాస్వామి ప్రబోధించారు. పవిత్ర ధర్మ విజయ యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు గ్రామంలో వేదపాఠశాల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌ను మహాస్వామి ప్రత్యేకంగా ఆశీర్వదించారు. హరిత ధరిత్రి కోసం పాటుపడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం మరింత పరిఢవిల్లాలని, దేశమంతటా విస్తరించాలని ఆకాంక్షించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా అడవుల పెంపకం, పునరుజ్జీవన ఉద్యమాలలో ఒకటైన ఈ కార్యక్రమాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్నందుకు సంతోష్ కుమార్‌ను అభినందించారు.
సీతాలక్ష్మణులను ఆదుకున్నది వృక్షాలే..
సనాతన ధర్మంలో వృక్షాలకు గల పవిత్ర స్థానాన్ని వివరిస్తూ జగద్గురువులు పలు సంస్కృత శ్లోకాలను ఉటంకించారు. నాటి రామాయణంలో లక్ష్మణుడి ప్రాణాలను రక్షించడానికి హనుమంతుడు తీసుకువచ్చిన సంజీవని కూడా ఒక మొక్కేనని గుర్తుచేశారు. అలాగే లంకలో అల్లాడిపోయిన సీతామాతకు ఆశ్రయమిచ్చి, ఆమె దుఃఖాన్ని ఉపశమింపజేసినది అశోక వనమేనని పేర్కొన్నారు. వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు అన్నీ తరువులకే అగ్రతాంబూలం ఇచ్చాయని, వృక్షాలను గౌరవించడం ధార్మిక నాగరికతకే మూలస్తంభమని స్పష్టం చేశారు. ప్రకృతి తనను తాను నయం చేసుకోవడం ప్రారంభిస్తే ఆ పర్యవసానాల బాధను మానవాళి తట్టుకోలేదని, అందుకే ముందే మేల్కొని పర్యావరణాన్ని కాపాడుకోవాలని హెచ్చరించారు.
బిల్వ, కదంబ, రావి మొక్కలు నాటిన జగద్గురువులు..
అమరకోశం లాంటి ప్రసిద్ధ సంస్కృత నిఘంటువుల నుండి ధార్మిక అంశాలను ప్రస్తావిస్తూ వైదిక విశ్వవీక్షణంలో వృక్షాల ప్రాధాన్యతను జగద్గురువులు వివరించారు. సంతోష్ అనే పేరులోనే ఆనందం ఉందని, ఆ ఆనందం ఈ హరిత ఉద్యమం ద్వారా దేశవ్యాప్తం కావాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి స్వయంగా పరమశివునికి ప్రీతిపాత్రమైన బిల్వ (మారేడు), అమ్మవారికి ఇష్టమైన కదంబం, పురాణాల్లో విశిష్టమైన పిప్పల (రావి) మొక్కలను నాటారు. సమస్త జీవకోటికి వృక్షాలే ప్రాణాధారమని, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పెంచి పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీఠం ప్రతినిధులు, వేద పండితులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు.


