ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి సన్నిధిలో వివాహాలు నిర్వహించుకోవాలనే భక్తుల కోరిక మేరకు దేవస్థానం అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. ఈ నెల 27, 30 తేదీలలో వివాహాలు జరుపుకోవడానికి అనువైన తాత్కాలిక వివాహ మండపాల ఏర్పాటు కోసం కొండపైన, దిగువన వివిధ ప్రాంతాలలో అనుకూలమైన స్థలాలను గుర్తించారు. భక్తులకు మరింత సౌకర్యవంతంగా స్వామివారి సన్నిధిలో వివాహ వేడుకలు నిర్వహించుకునే అవకాశం కల్పించే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆలయ కార్యనిర్వహణ అధికారి జల్లేపల్లి వెంకట్రావు కొండపై వివిధ ప్రాంతాలను స్వయంగా పరిశీలించి, వివాహ మండపాల ఏర్పాటుకు తగిన స్థలాలను ఖరారు చేశారు. కొండపై బస్ కాంప్లెక్స్ సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ పైభాగంలో 7 వివాహాలకు, దేవస్థానం కాంటీన్ హోటల్ పైభాగంలో 4 వివాహాలకు స్థలాలను గుర్తించారు. ఇప్పటికే గజపతి సత్రం వద్ద 8 వివాహాలకు అనుమతి కల్పించగా, దిగువన పుష్కరిణి సత్రము సెల్లార్‌లో మరో 6 స్థలాలను గుర్తించారు. ఇటు కొండపైన, అటు దిగువన కలిపి మొత్తం 19 వివాహాలకు తాత్కాలిక ప్రాతిపదికన సదుపాయం కల్పించేందుకు దేవస్థానం యంత్రాంగం చర్యలు చేపట్టింది. స్వామివారి సన్నిధిలో వివాహం చేసుకోవాలనుకునే భక్తులు ముందుగానే తమ వివాహ ఆహ్వాన పత్రిక, ఆధార్ కార్డులను దేవస్థానం వద్ద తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. భక్తులు దళారులను నమ్మి మోసపోవద్దని, కేవలం దేవస్థానం అధికారిక సిబ్బంది ద్వారా మాత్రమే మండపాల వివరాలు తెలుసుకోవాలని హెచ్చరించారు. స్థల అద్దె రూ. 10,000, మెయింటెనెన్స్ ఛార్జీలు రూ. 2,000, జీఎస్టీ రూ. 2,160 కలిపి మొత్తం రూ. 14,160 చెల్లించాల్సి ఉంటుందని, విద్యుత్ ఛార్జీలు అదనంగా వర్తిస్తాయని స్పష్టం చేశారు.


