సింహాచలం: తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలం తరహాలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధి గాంచిన సింహాచల గిరి ప్రదక్షిణ మహోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కొండపై, కొండ దిగువన జరుగుతున్న పలు ఇంజనీరింగ్ అభివృద్ధి పనులను ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) జల్లేపల్లి వెంకటరావు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతిని సమీక్షిస్తూ.. నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి భక్తులకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం తరహాలో అత్యాధునిక, మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

గిరి పౌర్ణమికి పటిష్ట ఏర్పాట్లు..

రానున్న గిరి పౌర్ణమి సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున, అడవివరం సెంటర్ నుంచి గాంధీనగర్ మీదుగా స్వామివారి పుష్కరిణి వరకు రహదారిని ఈవో పరిశీలించారు. భక్తులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆలయ డీఈ ఇన్‌చార్జి రామరాజు, మాజీ కార్పొరేటర్ పీవీ నరసింహాతో కలిసి చర్చించారు. అనంతరం తొలి పావంచ వద్ద నిర్మాణంలో ఉన్న టెన్సైల్ షెడ్ పనులను పరిశీలించి, గిరి పౌర్ణమి నాటికి పూర్తి చేయాలన్నారు. గిరి ప్రదక్షిణ భక్తులు కొబ్బరికాయలు కొట్టేందుకు వీలుగా ప్రత్యేక గట్టర్ల ఏర్పాటుపై దిశా నిర్దేశం చేశారు. బస్సు స్టాండ్ వద్ద పాత భవనం కూల్చివేత పనులను పర్యవేక్షిస్తూ, రవాణాకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు.

ఒకే కేంద్రంలో అన్ని టికెట్లు..

క్యూ లైన్లలో వేచి ఉండే భక్తుల కోసం బ్లూ స్టార్ వాటర్ కూలర్ల ఏర్పాటు పనులను ఈవో పరిశీలించారు. వేసవి, ఉక్కపోతల దృష్ట్యా భక్తుల వద్దకే తాగునీరు అందించేలా వాటర్ బ్యాక్ ట్యాంకులను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. భక్తులకు మరింత సులభంగా సేవలు అందించేలా ఆన్‌లైన్ దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, ప్రసాదాల కౌంటర్లను ఒకే తాటిపైకి తెస్తూ సింగిల్ విండో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం గజపతి సత్రంలో జరుగుతున్న సానిటేషన్, ఇంజనీరింగ్ పనులను పరిశీలించి పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 10 Jul 2026 | 12:46 PM IST