తిరుపతి: చిత్తూరు జిల్లా కలికిరిలోని సీఆర్పీఎఫ్ కేంద్రంలో రూ.26 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన వివిధ భవనాల సముదాయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. అంతకుముందు తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న కేంద్రమంత్రికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సభ్యులు భానుప్రకాశ్, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి నేరుగా రోడ్డు మార్గంలో కలికిరి చేరుకున్న ఆయన, తొలుత అమరవీరుల స్థూపాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా రూ.9.47 కోట్లతో ఆఫీసర్స్ మెస్, రూ.7.9 కోట్లతో సబార్డినేట్ మెస్, రూ.4.9 కోట్లతో రిక్రియేషన్ క్లబ్, రూ.4.55 కోట్లతో స్టోర్ బ్లాక్ భవనాలను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ ఏడీజీ సౌత్ జోన్ రవిదీప్ సింగ్ సాహి, ఐజీ దినేష్ ప్రతాప్ ఉపాధ్యాయ్, బ్రిగేడియర్ అనుపమ్ శర్మ, డీఐ సుభాష్ చంద్రశర్మ, చీఫ్ ఇంజనీర్ సీఎన్.సురేష్ తదితరులు పాల్గొన్నారు.

జవాన్ల సంక్షేమానికి పెద్దపీట

అనంతరం జవాన్లను ఉద్దేశించి కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రసంగించారు. దేశ అంతర్గత భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు 24 గంటలు విధుల్లో ఉండే బలగాల సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, హోంమంత్రి అమిత్ షా మార్గదర్శనంలో బలగాల ఆధునీకరణకు పలు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జవాన్లు దేశ భద్రత కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులను నిర్వర్తిస్తున్నారని, అందుకే వారికి ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఆధునిక భవనాలు జవాన్ల ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని మరింత పెంచుతాయని అన్నారు.

కలికిరి సీఆర్పీఎఫ్ కేంద్రం ప్రత్యేకత

వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే సిబ్బందికి తీవ్రవాద వ్యతిరేక చర్యలు (Anti-Terrorism), తిరుగుబాటు వ్యతిరేక చర్యలు (Counter-Insurgency) వంటి ప్రత్యేక నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా చిత్తూరు జిల్లా కలికిరిలో మే 11, 2017న ఈ కేంద్రం ఏర్పాటయింది. 2018లో మౌలిక వసతులు అభివృద్ధి చేయగా, 2019 నుండి శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 17 Aug 2026 | 04:52 PM IST
Tags: