హైదరాబాద్: తెలంగాణకు చెందిన ప్రతిభావంతులైన షూటర్ ధనుష్ శ్రీకాంత్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గాయత్రి గోపీచంద్‌కు ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులు లభించడం పట్ల రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుతూ రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ధనుష్ శ్రీకాంత్, గాయత్రి గోపీచంద్ తమ పట్టుదల, కృషితో అర్జున అవార్డులను సాధించడం యువ క్రీడాకారులందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తోందని స్పష్టం చేశారు.
తెలంగాణ నుంచి మరింత మంది క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించేలా క్రీడా మౌలిక వసతులు, అధునాతన మైదానాలు మరియు మెరుగైన శిక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. తెలంగాణను క్రీడా రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి పునరుద్ఘాటించారు.


