హైదరాబాద్: రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరిగే బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్ 2026 సీజన్ 2 పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎఫ్‌డీసీ చైర్మన్ దిిల్ రాజు ప్రకటించారు. ఈ మేరకు శనివారం సృజనాత్మక పోటీలకు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను ఎఫ్‌డీసీ ఎండీ జి. ముకుంద రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రెయేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా, ఎఫ్‌డీసీ ఈడీ కిషోర్ బాబులతో కలిసి ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, తెలంగాణ చరిత్రాత్మక సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు మరియు కళారూపాల ఆధారంగా షార్ట్ ఫిలిమ్స్, పాటల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సారి ప్రత్యేకంగా జానపద పాటలు, ప్రభుత్వ పథకాలపై ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రత్యేక వీడియోలు మరియు వ్యాసాలకు కూడా అవకాశం కల్పించామని, యువ ప్రతిభావంతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
క్రెయేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా మాట్లాడుతూ.. ఈ పోటీలు యువతకు భవిష్యత్తులో సినీ రంగంలో రాణించడానికి మంచి అవకాశాలను సృష్టిస్తాయని, సృజనాత్మక కంటెంట్‌కు చక్కటి వేదికగా నిలుస్తాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు విస్తృత స్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ వేదిక దోహదపడుతుందని పేర్కొన్నారు.
లఘు చిత్రాల నిడివి 3 నిమిషాలకు, పాటల రన్‌టైమ్ 5 నిమిషాలకు మించకూడదు. ఆయా వీడియోలు కచ్చితంగా 4కే రిజల్యూషన్ కలిగి ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఎంట్రీలను 2026 సెప్టెంబర్ 15లోపు youngfilmmakerschallenge@gmail.com మెయిల్ కు లేదా 8125834009 వాట్సాప్ నంబరుకు పంపాల్సి ఉంటుంది. నిపుణులతో కూడిన జ్యూరీ కమిటీ విజేతలను ఎంపిక చేసి ప్రకటిస్తుంది.
ప్రథమ బహుమతి కింద రూ. 3,00,000, ద్వితీయ బహుమతి కింద రూ. 2,00,000, తృతీయ బహుమతి కింద రూ. 1,00,000 అందజేయనున్నారు. మరో ఐదుగురికి కన్సోలేషన్ బహుమతిగా చెరో రూ. 20,000 అందించనున్నారు. విజేతలందరికీ ఆకర్షణీయమైన జ్ఞాపికలతో పాటు ప్రశంసా పత్రాలు ప్రదానం చేస్తారు.


