షాద్‌నగర్: ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని షాద్‌నగర్ పోలీసులు స్పష్టం చేశారు. స్థానిక బుగ్గారెడ్డి గార్డెన్స్‌లో షాద్‌నగర్ పోలీస్ స్టేషన్, ఫీచర్ సిటీ సంయుక్త ఆధ్వర్యంలో డ్రైవర్లు, వాహనదారుల కోసం ప్రత్యేక ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, డ్రైవింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సీఐ బి.శంకరయ్య మాట్లాడుతూ.. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు డ్రైవర్లు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. వాహనాలను ఇష్టానుసారంగా నిలపకుండా క్రమపద్ధతిలో పార్కింగ్ చేయాలన్నారు. డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ మాట్లాడటం, దృష్టిని రోడ్డు నుంచి మళ్లించడం ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం ప్రతి డ్రైవర్ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి డ్రైవర్ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే పాయింట్ల విధానం ద్వారా లైసెన్స్ రద్దుకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగానికి పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. ఏసీపీ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. వాహనం నడిపే సమయంలో డ్రైవర్ పూర్తి ఏకాగ్రత రోడ్డుపైనే ఉండాలని, మానవ తప్పిదాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
అలాగే డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని అధికారులు ఆదేశించారు. యూనిఫామ్‌లో ఉండటం వల్ల ప్రయాణికులు, పోలీసులకు సులభంగా గుర్తింపు లభిస్తుందన్నారు. వాహనాల తనిఖీలు నిబంధనల్లో భాగమేనని, వ్యక్తిగత కారణాలతో ఎవరినీ ఆపరని స్పష్టం చేశారు. మనిషి ప్రాణం ఎంతో విలువైనదని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ బి.శంకరయ్య, ఎస్సై వెంకటేష్, ఏఎస్ఐ ఆర్.రవీందర్, పోలీస్ సిబ్బంది, భారీ సంఖ్యలో డ్రైవర్లు, వాహనదారులు పాల్గొన్నారు.


