బండ్లగూడ: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఆధ్వర్యంలో బండ్లగూడ ఎక్స్ రోడ్ వద్ద చేపడుతున్న బాక్స్ డ్రెయిన్ నిర్మాణ పనులకు అనుకూలంగా జలమండలి కీలక నిర్ణయం తీసుకుంది. నగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్-3, రింగ్ మెయిన్-1 పరిధిలోని 1500 ఎంఎం వ్యాసం గల ఎంఎస్ గ్రావిటీ మెయిన్‌పై అత్యవసర జంక్షన్ పనులు చేపట్టనున్నారు. ప్రతిపాదిత బాక్స్ డ్రెయిన్ అలైన్‌మెంట్‌లో ఈ ప్రధాన పైప్‌లైన్ అడ్డుగా ఉండటంతో, డ్రెయిన్ పనులు ఎలాంటి ఆటంకం లేకుండా సాగేందుకు ఈ మార్పు అవసరమైంది.
ఈ పనులను శనివారం ఉదయం 10 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు (24 గంటల పాటు) నిరంతరంగా చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా ఫేజ్-3, రింగ్ మెయిన్-1 పరిధిలోని పలు రిజర్వాయర్ కమాండింగ్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పూర్తిగా లేదా పాక్షికంగా నిలిచిపోనున్నట్లు, మరికొన్ని ప్రాంతాల్లో లో-ప్రెషర్‌తో నీరు వస్తుందని జలమండలి అధికారులు వెల్లడించారు.
నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రాంతాలు
శాస్త్రిపురం, బండ్లగూడ, శంషాబాద్, మధుబన్, దుర్గానగర్, సులేమాన్ నగర్, పీడీపీ, గోల్డెన్ హైట్స్, అత్తాపూర్, కిస్మత్‌పూర్, 9 నంబర్, అల్లాబండ, భోజగుట్ట, గంధంగూడ, ప్రసన్ననగర్, జూబ్లీహిల్స్, తట్టిఖానా, గచ్చిబౌలి, మాదాపూర్, షేక్‌పేట్ రిజర్వాయర్ల పరిధిలోని పలు కాలనీలలో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. కావున నగర ప్రజలు ముందస్తుగా తగినన్ని నీటిని నిల్వ చేసుకుని, జలమండలి సిబ్బందికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.


