షాద్‌నగర్: షాద్‌నగర్ పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను గౌడ సంఘాల ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చిత్రపటానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందెమోహన్ ముదిరాజ్, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. సర్వాయి పాపన్న గౌడ్ సామాన్య ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం పాలకులపై ఎదురునిలిచి పోరాడిన గొప్ప వీరుడని అన్నారు. ఆయన జీవితం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని, పాపన్న ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. పాపన్న గౌడ్ కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితమైన నాయకుడు కాదని, సామాజిక సమానత్వం, ప్రజల ఆత్మగౌరవం కోసం నిరంతరం శ్రమించిన ప్రజా వీరుడని కొనియాడారు. ఆయన ధైర్యం, తెగువ, నాయకత్వ లక్షణాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమన్నారు. మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ మాట్లాడుతూ.. పాపన్న పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు ఎడ్ల శ్రీకాంత్ గౌడ్, అభిలాష్ గౌడ్, భానుచందర్ గౌడ్, రంగయ్య గౌడ్, కట్ట వెంకటేష్ గౌడ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.


