హైదరాబాద్: పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపడం అత్యంత దుర్మార్గమైన చర్య అని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీపీఆర్ తిప్పిపంపిన నేపథ్యంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ నీటి హక్కులను ఆంధ్రా అధికారుల చేతుల్లో పెట్టిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబు ప్రయోజనాల కోసం పాలమూరు భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు.

పోలవరం, బనకచర్లకు లేని అభ్యంతరాలు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు మాత్రమే ఎందుకు వస్తున్నాయని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెలంగాణను బలిపీఠం ఎక్కిస్తోందని ఆరోపించారు. రాష్ట్రం నుండి గెలిచిన 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు పార్లమెంటులో తెలంగాణ ప్రాజెక్టుల కోసం గళమెత్తకుండా చేతులు ముడుచుకుని కూర్చున్నారని విమర్శించారు. కర్ణాటక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని నిలదీశారు.

బీఆర్ఎస్ హయాంలోనే హైడ్రాలజీ మినహా మిగతా అన్ని రకాల అనుమతులు సాధించడం జరిగిందని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు క్లియరెన్స్ లభించడంతో ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ వచ్చినట్లేనని, ప్రస్తుతం మిగిలిన నీటి కేటాయింపుల అంశం కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ (KWDT) పరిధిలో ఉందన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తనకున్న నీటి కేటాయింపుల నుంచే ఈ ప్రాజెక్టుకు 90 టీఎంసీలు కేటాయించిందని, కాబట్టి కేంద్రం తక్షణమే డీపీఆర్‌ను ఆమోదించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఢిల్లీకి అఖిలపక్ష ప్రత్యేక ప్రతినిధి బృందాన్ని పంపాలని, పాలమూరు రైతాంగానికి అన్యాయం జరిగితే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో శాశ్వత ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.

Read latest Politics News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 10 Aug 2026 | 08:33 PM IST
Tags: