హైదరాబాద్: ప్రజా కేంద్రిత పాలనను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతిష్టాత్మక “రిఫార్మ్ ఉత్సవ్ (Reform Utsav)” కార్యక్రమం కార్యాచరణ మరియు అమలుపై భారత ప్రభుత్వ కేబినెట్ కార్యదర్శి డాక్టర్ టి.వి. సోమనాథన్ సోమవారం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో సమీక్షా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు, సూచనలను సేకరించి వాటిని ఆచరణాత్మక సంస్కరణలుగా మార్చి పారదర్శకంగా అమలు చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
అక్టోబర్ 2026 నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాన్ని మొత్తం మూడు దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశగా ఆగస్టు-సెప్టెంబర్ 2026లో సన్నాహక వాతావరణం, అధికారుల సెన్సిటైజేషన్ చేపడతారు. రెండో దశగా అక్టోబర్-డిసెంబర్ మధ్య 'జన్ మంథన్', 'విమర్శ్-జన్ సమాధాన్', 'సంకల్ప సిద్ధి' వంటి అవగాహన, భాగస్వామ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడో దశగా డిసెంబర్ 28, 2026 నుంచి సంస్కరణల నిరంతర పర్యవేక్షణ చేపడతారు. ఈ ప్రక్రియ కోసం ప్రతి రాష్ట్రంలో సీఎస్ అధ్యక్షతన స్టేట్ కోఆర్డినేటివ్ కమిటీతో పాటు స్టేట్ నోడల్ ఆఫీసర్ (SNO)ను నియమిస్తారు. ప్రజల సౌకర్యార్థం ప్రాంతీయ భాషల్లో "రిఫార్మ్ ఉత్సవ్ పోర్టల్"ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో పాటు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నవీన్ మిట్టల్, స్టీఫెన్ రవీంద్ర, లా సెక్రటరీ బి. పాపిరెడ్డి, అనుదీప్ దురిశెట్టి, అహ్మద్ నదీమ్, మహేష్ దత్ ఎక్కా, గౌరవ్ ఉప్పల్, స్వాతి లక్రా, దేవసేన, దివ్య దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు.


