ముంబై: దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికిల్స్‌ లిమిటెడ్‌ (టీఎంపీవీ) తన సరికొత్త బ్రాండ్‌ గుర్తింపు ‘టాటా.కార్స్‌’ను గురువారం అధికారికంగా ఆవిష్కరించింది. కంపెనీ తరఫున విస్తరిస్తున్న ప్యాసింజర్ వాహనాల పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేయడంతో పాటు, నేటి యువతరం కార్ల కొనుగోలుదారులను ప్రత్యేకంగా ఆకర్షించడమే లక్ష్యంగా ఈ కొత్త బ్రాండ్‌ను తీసుకొచ్చినట్లు టీఎంపీవీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శైలేష్‌ చంద్ర వెల్లడించారు.

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్లు, ప్రీమియం ఎస్‌యూవీలు, ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ (ఈవీలు)తో పాటు అత్యాధునిక ఫ్యూచర్‌ మొబిలిటీ సొల్యూషన్లన్నింటినీ ఇకపై ‘టాటా.కార్స్‌’ బ్రాండ్‌ కిందకే తీసుకురానున్నట్లు ఆయన స్పష్టం చేశారు. డిజిటల్ చానళ్లు, రిటైల్ కేంద్రాలు, అధీకృత సర్వీస్‌ టచ్‌ పాయింట్లు, అన్ని రకాల బ్రాండ్‌ కమ్యూనికేషన్స్‌పై ఈ కొత్త లోగో, బ్రాండ్ గుర్తింపు కనిపించనుంది. ఆటోమొబైల్ మార్కెట్‌లో తన మార్క్‌ను మరింత విస్తరించే దిశగా టాటా మోటార్స్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

Read latest Business News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 28 Aug 2026 | 03:32 AM IST
Tags: