షాద్‌నగర్: షాద్‌నగర్ పట్టణ ప్రధాన చౌరస్తా విస్తరణ, అభివృద్ధి పనులను తక్షణమే వేగవంతం చేయాలని కోరుతూ విద్యార్థులు వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు. పాఠశాలల్లో ప్రతిరోజు చేసే సాధారణ ప్రతిజ్ఞకు బదులుగా.. "షాద్‌నగర్ చౌరస్తా విస్తరణ వెంటనే చేయండి.. మా ప్రాణాలకు రక్షణ కల్పించండి" అంటూ ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేస్తూ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులకు తమ ఆవేదనను తెలియజేశారు.
షాద్‌నగర్ పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీ, తీవ్రమైన ట్రాఫిక్ సమస్యల కారణంగా ప్రతినిత్యం విద్యార్థులు, సాధారణ ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య ప్రయాణించాల్సి వస్తోంది. ముఖ్యంగా ప్రధాన చౌరస్తా పరిధిలో విపరీతమైన ట్రాఫిక్ నిలిచిపోతుండటంతో సమయానికి పాఠశాలలకు వెళ్లలేకపోతున్నామని, రోడ్డు దాటే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశముందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. తమ ప్రాణ భద్రత కోసం తాము రోడ్లపైకి వచ్చి ధర్నాలు, ఆందోళనలు చేయాలా అని అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. విద్యార్థులు పాఠశాలల్లోనే ప్రతిజ్ఞ రూపంలో చేపట్టిన ఈ నిరసన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారులు, పాలకులు స్పందించి చౌరస్తా విస్తరణ పనులకు ఉన్న అడ్డంకులను తొలగించి, పనులను వేగవంతం చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు గట్టిగా కోరుతున్నారు.


