మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి అలివేలుపై గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు చేసిన తీవ్ర అవినీతి, అక్రమాల ఆరోపణలపై శుక్రవారం జిల్లా స్థానిక సంస్థల పంచాయతీ అధికారి (డీఎల్‌పీఓ) సాంబిరెడ్డి గ్రామంలో ప్రత్యక్ష విచారణ నిర్వహించారు. స్థానికులు అందజేసిన ఫిర్యాదుల ఆధారంగా క్షేత్రస్థాయిలో సంబంధిత ప్రాంతాలను డీఎల్‌పీఓ పరిశీలించారు. విచారణ అనంతరం సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని, వారి ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని డీఎల్‌పీఓ వెల్లడించారు.

గ్రామంలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ పంచాయతీ కార్యదర్శి అలివేలు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అక్రమార్కులకు సహకరిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. అంతేకాకుండా, గ్రామంలో ఉన్న వైకుంఠధామ సూచిక బోర్డును ఎవరికీ సమాచారం ఇవ్వకుండా తొలగించి, ప్రైవేట్ వెంచర్‌కు అనుకూలంగా వ్యవహరించారని మండిపడ్డారు. అధికారిక వ్యవహారాల్లో కార్యదర్శి భర్త ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటూ పెత్తనం చెలాయిస్తున్నారని పాలకవర్గ సభ్యులు డీపీఓ, డీఎల్‌పీఓలకు విన్నవించారు. అక్రమ నిర్మాణాలపై చట్టప్రకారం తక్షణ చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డీఎల్‌పీఓ కార్యదర్శిని ఆదేశించారు.

కాగా, తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని గ్రామ కార్యదర్శి అలివేలు స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, అధికారుల ఆదేశాల మేరకే విధులు నిర్వహిస్తున్నానని తెలిపారు. ప్రతి అక్రమ నిర్మాణంపై నోటీసులు జారీ చేయాలని ఆదేశించినట్లు ఎంపీఓ రవీందర్ వివరించారు. కార్యదర్శిని విధుల నుంచి తొలగించే వరకు తమ పోరాటం ఆపేది లేదని స్థానికులు హెచ్చరించారు. ఈ విచారణ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అమనగంటి ప్రశాంత్ రెడ్డి, చెన్నరెడ్డి మహేందర్ రెడ్డి, రఘువీర్, రాంచేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 7 Aug 2026 | 05:49 PM IST
Tags: