శంషాబాద్: శంషాబాద్ పరిధిలో అసాంఘిక, అక్రమ కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు ఎయిర్‌పోర్ట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులు భారీ ఎత్తున 'కార్డన్ సెర్చ్' నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతను ధ్యేయంగా పెట్టుకుని శనివారం తెల్లవారుజామున చేపట్టిన ఈ విస్తృత తనిఖీల్లో టాస్క్‌ఫోర్స్, మహిళా పోలీసులు, సివిల్ మరియు ఆర్మ్డ్ రిజర్వ్‌కు చెందిన సుమారు 200 మంది సిబ్బంది పాల్గొన్నారు.
తనిఖీల్లో భాగంగా శంషాబాద్‌లోని హైమత్‌నగర్, ఖాజీగల్లి, ఎలుకలబస్తీ, ప్రకాశ్‌నగర్, శివాజీనగర్, శంకర్‌మఠ్ తదితర ప్రాంతాల్లో పోలీసులు ఇంటింటికీ వెళ్లి సమగ్రంగా సోదాలు చేశారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, నివాసితుల ఐడెంటిటీ కార్డులు, వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సోదాల్లో సరైన ధ్రువపత్రాలు లేని 22 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, అనుమతి లేకుండా అక్రమంగా నిల్వ చేసిన 40 లీటర్ల డీజిల్‌ను సీజ్ చేశారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న 8 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ రికార్డులతో ఫింగర్ ప్రింట్లు సరిపోల్చే ప్రక్రియ చేపట్టి విచారిస్తున్నారు.
ఈ ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస ప్రజలు ఎక్కువగా నివసిస్తుండటంతో వారి పూర్తి వివరాలను పోలీసులు నమోదు చేసుకున్నారు. క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వారిపై, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని శంషాబాద్ డీసీపీ రాజేష్ స్పష్టం చేశారు. ప్రాంతంలో నిరంతరం నిఘా కొనసాగుతుందని, ప్రజల భద్రత కోసం భవిష్యత్తులోనూ ఇలాంటి కార్డన్ సెర్చ్‌లు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు.


