హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆహార భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 1.06 కోట్ల కొత్త 'స్మార్ట్ రేషన్ కార్డుల' పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
ఈ ప్రతిష్ఠాత్మక సంక్షేమ పథకం ద్వారా తెలంగాణలోని 3.42 కోట్ల మంది అర్హులైన లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం చేకూరనుందని మంత్రి వివరించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. ఈ బృహత్తర కార్యక్రమ అమలు కోసం ప్రతి నెలా ప్రభుత్వం సుమారు 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేయనుందని పేర్కొన్నారు.
శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడారు. సంగారెడ్డిలో సీఎం కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు, మిగిలిన 32 జిల్లాల్లోనూ అదే రోజు ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఏకకాలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సాగాలని స్పష్టం చేశారు. ప్రతి అర్హ కుటుంబానికి గౌరవప్రదమైన జీవనానికి అవసరమైన ఆహార భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, స్వాతంత్ర్య దినోత్సవం రోజున జరిగే ఈ పంపిణీని అధికారులు అత్యంత ప్రాధాన్యతతో, పరస్పర సమన్వయంతో విజయవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.


