షాద్‌నగర్: జీవో 97ను వెంటనే రద్దు చేయాలని, శక్తి పాలసీని పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు షాద్‌నగర్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ (SFI), ఏఐఎస్ఎఫ్ (AISF) ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో వందలాది మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. "శక్తి హఠావో.. పాలిటెక్నిక్ బచావో", "శక్తి వద్దు.. సాంకేతిక విద్య ముద్దు" అంటూ కార్యాలయ పరిసరాలను హోరెత్తించారు.

ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తును ఆశించి పాలిటెక్నిక్ కళాశాలల్లో చేరుస్తున్నారని తెలిపారు. మూడేళ్ల డిప్లొమా పూర్తయ్యాక ఈసెట్ (ECET) ద్వారా ఇంజినీరింగ్‌లో చేరే వెసులుబాటు ఉందని, అయితే జీవో 97 అమలులోకి వస్తే డీఆర్డీఓ, రైల్వే వంటి కీలక ప్రభుత్వ రంగ సంస్థల్లో సాంకేతిక ఉద్యోగాలకు అర్హత కోల్పోయే ప్రమాదం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 'యంగ్ ఇండియా స్కిల్స్' పేరుతో పాలిటెక్నిక్ విద్యార్థులను కేవలం నైపుణ్య కార్మికులుగా మార్చడం సరికాదని, సాంకేతిక విద్యా సంస్థలను ఇతర విభాగాల పరిధిలోకి మార్చే ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల ఆందోళనకు బీజేపీ మద్దతు

ఈ నిరసన కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటీకరణతో ముడిపెట్టి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఎస్బీటెట్ (SBTET) పరిధిలోనే పాలిటెక్నిక్ విద్యను కొనసాగించాలని స్పష్టం చేశారు. విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న తరుణంలో ప్రభుత్వం మొండివైఖరి వీడి న్యాయం చేయాలని, లేకుంటే విద్యార్థుల తీవ్ర ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

inline-img
విద్యార్థులకు మద్దతుగా బీజేపీ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

ధర్నా అనంతరం విద్యార్థి సంఘాల ప్రతినిధులు షాద్‌నగర్ ఆర్డీఓ సరితకు వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల సమస్యలను విన్న ఆర్డీఓ, ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులతో పాటు పాలిటెక్నిక్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 22 Aug 2026 | 04:44 PM IST
Tags: