కల్వకుర్తి: నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ఆయన ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పర్యటించారు.

ముందుగా మక్తమాధారం గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు పంచాయతీ పాలన సేవలు మరింత సులభంగా, పారదర్శకంగా అందేందుకు నూతన భవనం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

కర్కల్పహాడ్‌లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం

అనంతరం కర్కల్పహాడ్ గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, లబ్ధిదారులతో నేరుగా ముచ్చటించి ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో మండల ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 26 Oct 2026 | 10:17 PM IST
Tags: