పవిత్ర ఉమ్రా యాత్ర నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లి తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల యాత్రికులను తక్షణమే సురక్షితంగా స్వదేశానికి రప్పించాలని కేఎన్ఆర్ సేవాదళం వ్యవస్థాపక అధ్యక్షుడు మెకానిక్ బాబా ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విమానాల సాంకేతిక లోపాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణాల వల్ల జెడ్డా, మదీనా విమానాశ్రయాల వద్ద సుమారు 4 వేల మంది భారతీయ యాత్రికులు చిక్కుకుపోయి నానా అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

సౌదీలో చిక్కుకున్న వారిలో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ మరియు కల్వకుర్తి ప్రాంతాలకు చెందిన ఉమ్రా యాత్రికులే ఉన్నారని తెలిపారు. విమానాలు రద్దు కావడం, సర్వీసులు ఆలస్యం కావడంతో చేతిలో ఉన్న డబ్బులు పూర్తయి యాత్రికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. మరోవైపు హోటల్ బస గడువు, వీసా గడువు ముగుస్తుండటంతో వృద్ధులు, మహిళలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని, ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులు సైతం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్యేక హెల్ప్ డెస్క్, ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయాలి

ఈ తీవ్రమైన మానవతా సమస్యపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తక్షణమే స్పందించాలని కోరారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి ఈ అంశాన్ని ముఖ్యమంత్రి, మైనారిటీ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. సౌదీలోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) ద్వారా యాత్రికులకు తక్షణ భోజన, వసతి వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.

కేంద్ర విదేశాంగ శాఖతో మాట్లాడి వీసా గడువు పొడిగించేలా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి యాత్రికులను సురక్షితంగా మాతృభూమికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. బాధితుల సమాచారం కోసం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్, హజ్ హౌస్‌లలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను అందుబాటులోకి తేలాలని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న తమ పౌరులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం మరోసారి తన ఉదారతను, మానవత్వాన్ని చాటుకోవాలని మెకానిక్ బాబా ఆశాభావం వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 26 Oct 2026 | 09:53 PM IST
Tags: