అమనగల్లు: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 21 నుండి 31 వరకు నిర్వహిస్తున్న వారోత్సవాలు, పోలీస్ ఫ్లాగ్ డే వీక్ 2026లో భాగంగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని అమనగల్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం పలు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత, పోలీసు సిబ్బందిని భాగస్వామ్యం చేస్తూ వినూత్న రీతిలో ఈ కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్భంగా అమనగల్ పోలీస్ స్టేషన్‌లో జెడ్పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పోలీసుల విధులు, బాధ్యతలు, ప్రజలకు అందించే రక్షణ సేవలు మరియు చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోలీసుల పనితీరును విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకునేలా ఈ కార్యక్రమం దోహదపడటంతో పాటు పోలీసులకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా నిలిచింది. ఇదే స్ఫూర్తితో అమనగల్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి కూడా పోలీసు వ్యవస్థలో ప్రజల పాత్ర, సామాజిక మాధ్యమాల సద్వినియోగం వంటి అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.

inline-img

అలాగే విద్యార్థుల్లో చైతన్యం నింపేందుకు స్థానిక ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ప్రత్యేకంగా వ్యాసరచన పోటీలు చేపట్టారు. జూనియర్ కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాల నివారణలో పౌరులు, పోలీసుల పాత్ర, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించగా, డిగ్రీ విద్యార్థులకు సామాజిక మాధ్యమాల దుర్వినియోగాన్ని అరికట్టడంలో పోలీసుల పాత్ర, తెలంగాణను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో యువత బాధ్యత వంటి అంశాలపై పోటీలు నిర్వహించి విజేతలను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థులు, యువతలో సామాజిక బాధ్యత పెంపొందుతుందని, ప్రజల సహకారంతో నేరరహిత సమాజ స్థాపనకు అమనగల్ పోలీసులు ఎప్పుడూ ముందుంటారని సీఐ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 26 Oct 2026 | 10:43 PM IST
Tags: