ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా పరిధిలో నిర్మించతలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ రహదారి విస్తరణ భూసేకరణ పరిహారం కేటాయింపులో తీవ్ర వ్యత్యాసం ఉందని ఆరోపిస్తూ బాధితులైన ఆమనగల్లు రైతులు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్, భూసేకరణ ప్రత్యేక అధికారి (డిప్యూటీ కలెక్టర్)లకు వినతిపత్రం సమర్పించారు. భూముల విలువ నిర్ణయంలో అధికారులు అనుసరించిన వైఖరి వల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని రైతులు వాపోయారు.
ఒకే రకమైన ప్రాథమిక భూమి విలువ (బేసిక్ వాల్యూ) కలిగిన భూములకు రెండు వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పరిహారాలు కేటాయించారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కడ్తాల్ ప్రాంతంలో ఎకరా ప్రాథమిక విలువ రూ.13,12,500 ఉండగా, పరిహారంగా రూ.55,56,383 కేటాయించారని తెలిపారు. అయితే అదే రూ.13,12,500 ప్రాథమిక విలువ కలిగిన ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని భూములకు మాత్రం కేవలం రూ.37,04,255 మాత్రమే పరిహారం నిర్ణయించారని వివరించారు. ఎకరాకు ఏకంగా రూ.18,52,128 వ్యత్యాసం చూపడం ఏమాత్రం తగదని కలెక్టర్‌కు సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు.
పరిహార వ్యత్యాసాన్ని సరిచేయాలి
భూసేకరణ పరిహారం కేటాయింపులో ఉన్న అసమానతలను తక్షణమే సమగ్రంగా పరిశీలించి పారదర్శకత పాటించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. భూముల స్వభావం, ప్రాంతం, వర్తించే నిబంధనలను పునఃపరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరారు. సమాన ప్రాథమిక విలువ కలిగిన తమ భూములకు కూడా కడ్తాల్ ప్రాంతంతో సమానంగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం న్యాయబద్ధమైన परिహారం అందించకపోతే రానున్న రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బాధిత రైతులు బోడ్యి నాయక్, పాండు నాయక్, రవి రాథోడ్, నరియా నాయక్, వినోద్ నాయక్, ఛత్రియ, పాండు, చందర్, బాలు, శివరాం, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.


