ఆమనగల్లు: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాలను నిరుపేద ప్రజలు, వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని ఆమనగల్లు సీఐ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు, రామ్‌రెడ్డి లయన్స్ ఐ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆమనగల్లు పట్టణంలోని రామ్‌రెడ్డి విజన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు నిరుపేదలకు అందిస్తున్న సామాజిక సేవలను కొనియాడారు. చూపు మందగించిన పేదలను గుర్తించి, ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఉచితంగా ఐఓఎల్ (IOL) శస్త్రచికిత్సలు చేయించి చూపు ప్రసాదించడం గొప్ప విషయమన్నారు. ప్రతి ఒక్కరూ తమ కళ్లను దానం చేసి మరొకరికి వెలుగు అందించాలని సూచించారు. మధుమేహం (షుగర్) వ్యాధి ఉన్నవారు క్రమం తప్పకుండా ప్రతి ఆరు నెలలకోసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని, కళ్ల పరిశుభ్రతను పాటించాలని తెలిపారు.

65 మందికి పరీక్షలు.. 16 మందికి కంటి ఆపరేషన్లు

శిబిరంలో ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ నేతృత్వంలో మొత్తం 65 మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో తీవ్ర కంటి సమస్యలతో బాధపడుతున్న 16 మందిని ఉచిత ఐఓఎల్ కంటి ఆపరేషన్ల నిమిత్తం రామ్‌రెడ్డి లయన్స్ ఐ హాస్పిటల్‌కు తరలించినట్లు క్లబ్ పిఆర్‌ఓ పాషా వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్లు ఎం. చంద్రశేఖర్, జూలూరు రమేష్, నటరాజ్ యాదయ్య, క్లబ్ కోశాధికారి గంప శ్రీను, సభ్యులు రాము, కొండల్ రెడ్డి, పాండు రెడ్డి, పిఆర్‌ఓ పాషా, లియో క్లబ్ ప్రెసిడెంట్ శ్యామ్, ఆసుపత్రి సిబ్బంది శిరీష తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 26 Oct 2026 | 10:21 PM IST
Tags: