న్యూఢిల్లీ: పవిత్రమైన విజయదశమి (దసరా) పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేసింది.
రావణాసురుడిపై శ్రీరాముడు సాధించిన చారిత్రక విజయానికి విజయదశమి ప్రతీక అని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. శ్రీరాముడు ధర్మం, నైతిక ప్రవర్తన, మానవతా విలువలకు మూర్తిభవించిన రూపంగా దేశవ్యాప్తంగా పూజింపబడతారని కొనియాడారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో సంతోషం, ఐక్యత, శాంతిని నింపాలని, ప్రతి ఒక్కరిలోనూ సత్ప్రవర్తనను పెంపొందించాలని ఆకాంక్షించారు. దసరా స్ఫూర్తితో దేశ ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.


