హైదరాబాద్: పవిత్రమైన విజయదశమి (దసరా) పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి, అధర్మంపై ధర్మం పొందిన పైచేయికి విజయదశమి పండుగ గొప్ప సంకేతమని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవంలోనూ, ఆచార సంప్రదాయాలలోనూ దసరా పండుగకు అత్యంత విశిష్టమైన స్థానం ఉన్షదని సీఎం కొనియాడారు. సత్యం, ధర్మం, ఆత్మవిశ్వాసం, ధైర్యం, ప్రజలందరి ఐకమత్యానికి విజయదశమి మహోత్సవం నిదర్శనమని అభివర్ణించారు. ఎంతటి కష్టనష్టాలు ఎదురైనా సరే, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ధర్మమార్గంలో ముందుకు సాగితే అంతిమ విజయం మనదే అవుతుందనే గొప్ప విశ్వాసాన్ని, సందేశాన్ని ఈ పండుగ సమాజానికి అందిస్తుందని తెలిపారు.
ఈ విజయదశమి పర్వదినం రాష్ట్ర ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని, ప్రతి ఒక్కరూ సంతోష ఐశ్వర్యాలతో విలసిల్లాలని సీఎం ఆకాంక్షించారు. శ్రీ లక్ష్మీదేవి, శ్రీ దుర్గాదేవిల కరుణాకటాక్షాలు, దివ్య ఆశీస్సులు తెలంగాణ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.


