న్యూఢిల్లీ: ప్రైవేట్ శాటిలైట్ టెలివిజన్ చానెళ్లు తమ ప్రసార కార్యక్రమాల్లో కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ చట్టం, నిబంధనల్లోని కార్యక్రమ నియమావళిని తప్పనిసరిగా పాటించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం అన్ని టెలివిజన్ చానెళ్లకు ఆ శాఖ ప్రత్యేకంగా ఒక అడ్వైజరీని జారీ చేసింది. ముఖ్యంగా వార్తలు, గ్రాఫిక్స్, వర్చువల్ న్యూస్ ప్రజంటేషన్లు, ఇతర కార్యక్రమాల రూపకల్పనలో ఏఐ (AI), జనరేటివ్ ఏఐ టెక్నాలజీ వాడకంపై అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వార్తల కచ్చితత్వం, విశ్వసనీయత, సున్నితత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగకుండా ఏఐ సాధనాలను కేవలం సహాయక సాధనాలుగానే వినియోగించాలని స్పష్టం చేసింది.
టీవీ చానెళ్లకు కేంద్రం కీలక అడ్వైజరీ.. ఏఐ వినియోగం, ఉగ్ర ఆపరేషన్ల ప్రత్యక్ష ప్రసారాలపై స్పష్టమైన మార్గదర్శకాలు
కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ చట్టం, నిబంధనలను ప్రైవేట్ శాటిలైట్ టీవీ చానెల్స్ కచ్చితంగా పాటించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వార్తలు, గ్రాఫిక్స్ తయారీలో కృత్రిమ మేధస్సు (AI)ను సహాయక సాధనాలుగానే వాడాలని, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లను ప్రత్యక్ష ప్రసారం చేయరాదని హెచ్చరిస్తూ నూతన అడ్వైజరీ జారీ చేసింది.

వివిధ టెలివిజన్ చానళ్లు కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (రెగ్యులేషన్) చట్టం-1995, నిబంధనలు-1994లోని కార్యక్రమ నియమావళిని కొన్ని సందర్భాల్లో ఉల్లంఘిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ గుర్తించింది. కొన్ని చానళ్లలో ఒకే అంశానికి సంబంధించి సారూప్య వార్తలు ప్రసారమవుతున్నాయని, ఇటువంటి ప్రసారాలు నిబంధనల స్ఫూర్తికి అనుగుణంగా లేవని అభిప్రాయపడింది. ప్రసారాల్లో అనుచిత ప్రవర్తన, అసభ్య పదజాలాన్ని ప్రోత్సహించరాదని, వాటిని సాధారణ అంశాలుగా చిత్రీకరించరాదని హెచ్చరించింది. చర్చలు, ప్యానెల్ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రతినిధులను జాగ్రత్తగా ఎంపిక చేయడంతో పాటు వారికి తగిన అవగాహన కల్పించాలని సూచించింది. మత సామరస్యానికి విఘాతం కలిగించే, దేశ వ్యతిరేక భావాలను ప్రోత్సహించే వ్యాఖ్యలకు ఎలాంటి అవకాశం ఇవ్వరాదని స్పష్టం చేసింది. అవమానకరమైన, అభ్యంతరకరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రసారం కాకుండా చూడాలని, అవసరమైన సందర్భాల్లో ఆడియోను నిలిపివేయడం, హెచ్చరికల ప్రకటనలు జారీ చేయడం లేదా ప్రసారాన్ని నిలిపివేయడం వంటి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల విషయంలో భద్రతా దళాలు చేపట్టే ఆపరేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యక్ష ప్రసారం (Live Telecast) చేయరాదని మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. ఆపరేషన్ పూర్తిగా ముగిసే వరకు అధికారికంగా నియమితులైన అధికారి అందించే సమాచారానికే వార్తా కవరేజీని పరిమితం చేయాలని సూచించింది. నేరాలు, హింసకు సంబంధించిన వార్తలను సంచలనాత్మకంగా (సెన్సేషనల్) ప్రసారం చేయకుండా జాగ్రత్త వహించాలని, ప్రేక్షకులను ఇబ్బందికి గురిచేసే దృశ్యాల ప్రసారంలో సంయమనం పాటించాలని పేర్కొంది. ప్రకృతి విపత్తులు, భారీ ప్రమాదాలపై వార్తలను కేవలం ధ్రువీకరించిన సమాచారంతోనే ప్రసారం చేయాలని, దీనివల్ల ప్రజల్లో అనవసర భయాందోళనలు వ్యాపించకుండా నివారించవచ్చని తెలిపింది. అలాగే, భారతదేశ పటాల ప్రసారంలో సర్వే ఆఫ్ ఇండియా ప్రచురించిన అధికారిక, ప్రామాణిక మ్యాపులను మాత్రమే వినియోగించాలని మంత్రిత్వ శాఖ తమ అడ్వైజరీలో స్పష్టం చేసింది.
Read latest India News and Telugu News
Updated: 22 Oct 2026 | 09:25 AM IST
Tags:
మరిన్ని వార్తలు చదవండి
జిల్లా వార్తలు
పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా అమనగల్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్, వ్యాసరచన పోటీలు
ఆమనగల్లులో ఈ నెల 28న లయన్స్ క్లబ్, పోలీసు శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
లయన్స్ క్లబ్ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి
గ్రామ పంచాయతీ భవనం, ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
సౌదీలో చిక్కుకున్న తెలుగు ఉమ్రా యాత్రికులను స్వదేశానికి రప్పించాలి

