న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి జన్ ధన్ పథకం (PMJDY) పుష్కర కాలం (12 ఏళ్లు) విజయవంతంగా పూర్తి చేసుకుంది. గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లోని నిరుపేదలకు సైతం సులభంగా సంఘటిత బ్యాంకింగ్ సేవలను అందించే ఉద్దేశంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014 ఆగస్టు 28న ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పన్నెండేళ్ల ప్రయాణంలో జన్ ధన్ ఖాతాల సంఖ్య దేశవ్యాప్తంగా 59 కోట్లు దాటగా, ఆ అకౌంట్లలో ఇప్పటి వరకు రూ. 3.17 లక్షల కోట్లు జమైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం అధికారికంగా వెల్లడించింది.
పథకం విశేషాలు:
జన్ ధన్ ఖాతాల్లో సుమారు 78 శాతం ఖాతాలు గ్రామీణ మరియు అర్బన్/అర్థ్‌పట్టణ ప్రాంతాల్లో తెరిచినవే కావడం విశేషం.
మొత్తం ఖాతాదారులలో ఏకంగా 59 శాతం మంది మహిళలే ఉండటం గమనార్హం.
2026 ఆగస్టు 19 నాటికి ఒక్కో జన్ ధన్ ఖాతాలోని సగటు డిపాజిట్ రూ. 5,356గా నమోదైంది. గడిచిన 12 సంవత్సరాల్లో ఈ సగటు విలువ సుమారు 3.4 రెట్లు పెరిగినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.
ఈ పథకం ద్వారా అర్హులైన వ్యక్తులు ఎలాంటి కనీస నిల్వ (మినీమమ్ బ్యాలెన్స్) అవసరం లేకుండా బేసిక్ సేవింగ్స్ ఖాతాను ప్రారంభించుకోవచ్చు. కనీస నిల్వ నిర్వహణ వైఫల్య చార్జీలు కూడా దీనికి వర్తించవు. అంతేకాకుండా ఈ ఖాతాలపై రూపే డెబిట్ కార్డులను జారీ చేస్తుండగా, ఈ కార్డుపై రూ. 2 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం లభిస్తుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా జన్ ధన్ ఖాతాదారులకు 41.29 కోట్ల రూపే కార్డులను జారీ చేసినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. అలాగే, అర్హులైన ఖాతాదారులకు అత్యవసర సమయాల్లో రూ. 10,000 వరకు ఓవర్‌డ్రాఫ్ట్ (OD) సదుపాయం కూడా అందుబాటులో ఉంది.


