నేషనల్ డెస్క్: ‘ఆపరేషన్ సిందూర్’కు సంబంధించిన పలు ఆసక్తికర, కీలక విషయాలను రిటైర్డ్ ఎయిర్ చీఫ్ మార్షల్ జితేంద్ర సింగ్ తాజాగా మీడియాతో పంచుకున్నారు. భారత్ గగనతల రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన 'సుదర్శన చక్రం' (ఎస్-400) జాడను కనుక్కునేందుకు దాయాది దేశం పాకిస్థాన్ నానా తంటాలు పడిందని ఆయన వెల్లడించారు. భారత్‌లోని గూఢచార స్లీపర్ సెల్స్‌ను సైతం ఆ సమయంలో పాక్ తీవ్రంగా క్రియాశీలకం చేసిందని తెలిపారు. ఎస్-400 భయంతో పాకిస్థాన్ భారత్ వైపు తమ యుద్ధ విమానాలను పంపేందుకే వణికిపోయిందని, పాక్ విమానం ఏ చిన్న అడుగు వేసినా ఎస్-400తో క్షణాల్లో ధ్వంసం చేసేవాళ్లమని నాటి పరిస్థితులను ఆయన గుర్తుచేశారు.

ఎస్-400 జాడ కోసం విఫలయత్నాలు

"ఎస్-400 జాడను కనుగొనేందుకు వాళ్లు రకరకాల మార్గాలను అన్వేషించారు. తమకు అందుబాటులో ఉన్న ప్రతి సాధనాన్నీ పూర్తిగా వినియోగించుకున్నారు. ఇతర దేశాల శాటిలైట్ల ద్వారా మన ఎస్-400 లొకేషన్‌ను ట్రేస్ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. చివరకు భారత్‌లోని స్లీపర్ సెల్స్‌ను కూడా రంగంలోకి దించారు" అని జితేంద్ర సింగ్ వివరించారు.

భారత గగనతల రక్షణ రంగానికి ఎస్-400 (S-400 Triumf) అత్యంత శక్తిమంతమైన అస్త్రంగా మారిన విషయం తెలిసిందే. రష్యా అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ వ్యవస్థ ద్వారా భూమిపై నుంచి ప్రయోగించే శక్తివంతమైన క్షిపణులు శత్రుదేశాల విమానాలను గాల్లోనే అడ్డుకుని తునాతునకలు చేస్తాయి. అసాధారణ రాడార్ సామర్థ్యం ఉండటం వల్ల శత్రు దేశాల వాయుసేన విభాగాలు చాలా దూరంలో ఉండగానే గుర్తించి మరీ ఇవి ధ్వంసం చేయగలవు. కాగా, 2018లో భారత్ రష్యాతో ఐదు ఎస్-400 యూనిట్ల కొనుగోలు కోసం ఒప్పందం కుదుర్చుకోగా, ఇప్పటికే పలు యూనిట్లు భారత వైమానిక దళంలో చేరి దేశ రక్షణను మరింత పటిష్టం చేస్తున్నాయి.

Read latest India News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 27 Aug 2026 | 06:07 PM IST
Tags: