ఢిల్లీ: జాతీయ క్రీడా దినోత్సవం 2026 సందర్భంగా గురువారం ఉదయం 11:00 గంటలకు ప్రతిష్టాత్మకమైన ‘ఖేలో ఇండియా డైలాగ్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొని దేశవ్యాప్తంగా ఉన్న యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. క్రీడలు, యువ నాయకత్వం, ఫిట్‌నెస్, దేశ నిర్మాణం వంటి కీలక అంశాలపై ఆయన యువతతో ప్రత్యక్షంగా చర్చించనున్నారు. ‘యువ సంవాద్’లోని ముఖ్యమైన అంశాలపై మాట్లాడటంతో పాటు, క్రీడా మౌలిక వసతులు, కోచింగ్, స్పోర్ట్స్ సైన్స్‌పై ప్రత్యేకంగా చర్చించనున్నారు. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోని రెండు కళాశాలల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా యువ నాయకత్వాన్ని, స్వచ్ఛంద సేవలను ప్రోత్సహించడంపై మోదీ ప్రసంగం ఉండనుంది. భవిష్యత్తు నైపుణ్యాలు, పౌర బాధ్యతలపై ప్రధాని మోదీ యువతకు దిశానిర్దేశం చేయనున్నారు. యువత ఆకాంక్షలు జాతీయ క్రీడా విధానంలో భాగం కావాలని ఆయన పిలుపునివ్వనున్నారు. అలాగే ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రతిభావంతుల గుర్తింపు, వారికి అందించాల్సిన శిక్షణలపై కూడా ప్రత్యేకంగా చర్చ జరగనుంది.
దీంతో పాటు ‘నషా ముక్త్ యువ’ ఉద్యమంపై కూడా ప్రధాని మోదీ యువతతో ప్రత్యేకంగా సంభాషించనున్నారు. క్రీడల ద్వారా మాదక ద్రవ్యాల వ్యసనాలను సమూలంగా రూపుమాపడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ వేడుకల్లో ప్రముఖ భారత క్రీడాకారులు, పతక విజేతలు పాల్గొని తమ అనుభవాలను యువతతో పంచుకోనున్నారు.


