షాద్‌నగర్: రైతాంగానికి మరింత విస్తృతంగా, పారదర్శకంగా సేవలందించేందుకు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (సింగిల్ విండో) చైర్మన్లు, వైస్ చైర్మన్లు మరియు డైరెక్టర్లు పూర్తి చిత్తశుద్ధితో పనిచేయాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు. శనివారం షాద్‌నగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన ఆరుగురు చైర్మన్లు, ఆరుగురు వైస్ చైర్మన్లు, 74 మంది డైరెక్టర్లను ఎమ్మెల్యే పొన్నాడతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల కోసం నిజాయితీగా, నికార్సుగా పనిచేసే నాయకులకు పదవులు దక్కడం ఎంతో సంతోషకరమన్నారు. రైతులకు అవసరమైన సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లను సకాలంలో అందించడంలో సొసైటీ పాలకవర్గాలు కీలక పాత్ర పోషించాలని తెలిపారు. విత్తనం నాటే దశ నుండి పంట చేతికి వచ్చే వరకు, ఆ తర్వాత ధాన్యం మార్కెట్‌కు తరలించే వరకు ప్రతి అడుగులోనూ రైతులకు సొసైటీ ప్రజాప్రతినిధులు నిరంతరం అందుబాటులో ఉంటూ అండగా నిలవాల్సిన బాధ్యత ఉందన్నారు.
ఇదే సమయంలో నియోజకవర్గంలోని పలు సొసైటీల పనితీరును ఎమ్మెల్యే సమీక్షించారు. కొందుర్గు మండలం దామోదర్‌రెడ్డి సొసైటీతో పాటు షాద్‌నగర్, చేగూరు, మేకగూడ సొసైటీల పాలకవర్గాల సేవలను అభినందించగా, నందిగామ సొసైటీ తన పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ బలోపేతం కోసం ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక పథకాలను సొసైటీలు సమర్థవంతంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలన్నారు. బాధ్యతాయుతంగా పనిచేస్తే రైతులకు మేలు జరగడంతో పాటు నాయకులకు రాజకీయంగా కూడా ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు.


