వనపర్తి: వనపర్తి నియోజకవర్గ పరిధిలో మౌలిక సదుపాయాల విస్తరణ, విద్యార్థుల వసతుల మెరుగుదలకు ప్రత్యేక దృష్టి సారించినట్లు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆయన చాంబర్‌లో కలిసి, నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి ప్రతిపాదన నివేదికలను ఎమ్మెల్యే అందజేశారు.

వనపర్తిలో ప్రజలకు మెరుగైన రవాణా సేవలతో పాటు బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యా వసతులు కల్పించడమే లక్ష్యంగా ఐదు ప్రధాన నిర్మాణాలకు ప్రతిపాదనలు అందించారు. వీటిలో శాస్త్రీయ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌తో కూడిన జిల్లా రవాణా కార్యాలయ (RTO) నూతన భవనం, చిట్యాలలో ఎంజేపీ తెలంగాణ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (బాలుర) భవనం, కడుకుంట్లలో ఎంజేపీ బీసీ సంక్షేమ పాఠశాల (బాలుర) భవనం, పెబ్బేరు మరియు వెల్టూరులలో ఎంజేపీ బీసీ సంక్షేమ పాఠశాలల (బాలికల) నూతన భవనాల నిర్మాణాలు ఉన్నాయని వివరించారు.

ఆయా ప్రాంతాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నందున, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా భవనాలను తక్షణమే మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి సమర్పించిన నివేదికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించారు. ఆయా శాఖల పరిధిలో అవసరమైన ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, నూతన భవనాల నిర్మాణానికి వీలైనంత త్వరగా మంజూరీలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన మంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 8 Aug 2026 | 10:20 PM IST
Tags: