మహేశ్వరం: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేద విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బిజేవైఎం (BJYM) ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక శారద వొకేషనల్ కాలేజీ విద్యార్థులతో కలిసి నిర్వహించిన ఈ ఆందోళనలో బీజేవైఎం నాయకులు ప్లకార్డులు చేతబూని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ విద్యార్థుల నుండి సంతకాల సేకరణ చేపట్టారు.
ఈ సందర్భంగా బీజేవైఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మునావత్ దేవేందర్ నాయక్, నాయకుడు ముయ్యాడ శివ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల కోసం బిజేవైఎం తలపెట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగానే మహేశ్వరంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. విద్యార్థులకు రావలసిన దాదాపు రూ.15 వేల కోట్ల బకాయిలను ఆగస్టు 15వ తేదీలోపు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ సమస్యపై రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 1.50 లక్షల మంది విద్యార్థుల సంతకాలను సేకరించినట్లు వెల్లడించారు.
ఎన్నికల హామీలను విస్మరించి రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని నాయకులు విమర్శించారు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలతో పాటు ఎంఈఓ (MEO), డిఈఓ (DEO) పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలు మరియు కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, లేకపోతే రాబోయే రోజుల్లో బీజేవైఎం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు శివ, రాహుల్, అభిలాష్, కె. సాయి, విద్యార్థులు పాల్గొన్నారు.


