జటప్రోలు: రాష్ట్రంలో పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు కార్పొరేట్‌ స్థాయి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గం పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న 'యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌' నిర్మాణ పనులను సోమవారం మంత్రి నేరుగా పరిశీలించారు.

ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి, నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీపడకుండా పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో బాలురు, బాలికలకు ప్రత్యేకంగా యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లను అందుబాటులోకి తెస్తోందన్నారు. విద్యతో పాటు విద్యార్థుల సమగ్ర వికాసానికి అవసరమైన ఆధునిక ప్రయోగశాలలు (ల్యాబ్స్), డిజిటల్ వసతులు, క్రీడా సదుపాయాలతో ఈ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు.

విద్యారంగాన్ని పటిష్టం చేయడం ద్వారా తెలంగాణ విద్యార్థులను భవిష్యత్ పోటీ ప్రపంచానికి సద్ధం చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. జటప్రోలులో పాఠశాల భవన నిర్మాణాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేసి వీలైనంత త్వరగా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు జూపల్లి కృష్ణారావు సూచించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 10 Aug 2026 | 12:20 PM IST
Tags: