నార్సింగి: అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఓ దేశ సేవకుడి ప్రాణాలను బలిగొంది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ హైదర్ షాకోట్ ఎస్‌ఎమ్‌పీ స్కూల్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున తీవ్ర దిగ్భ్రాంతి రేకేత్తించే 'హిట్ అండ్ రన్' ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై కాలినడకన వెళ్తున్న ఓ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని వెనుక నుంచి అతివేగంతో దూసుకొచ్చిన మహీంద్రా 350 ఎస్‌యూవీ కారు అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఆ ఇంపాక్ట్‌కు ఆయన గాల్లోకి ఎగిరిపడి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం తర్వాత కూడా ఆగని ఆ కారు అదే వేగంతో ముందు వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనాన్ని తీవ్రంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరిలో ఒకరి కాలు విరిగిపోగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

inline-img
కారు ఢీకొనడంతో రోడ్డుపై పడిపోయిన ద్విచక్రవాహనం

ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న నలుగురు యువకులు వాహనాన్ని సంఘటనా స్థలంలోనే వదిలేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు సదరు వాహనం శంషాబాద్ ప్రాంతానికి చెందినదిగా గుర్తించారు. నిందితులు మద్యం మత్తులో కారు నడిపారా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నలుగురు యువకుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 10 Aug 2026 | 12:15 PM IST
Tags: