గోపాలాపూర్: పేద కుటుంబాల్లోని ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు పెంట్లవెల్లి మండలం గోపాలాపూర్ గ్రామంలో సోమవారం ఆయన స్వయంగా చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా చిన్నంబావి మండలానికి చెందిన పలువురు అర్హులైన లబ్ధిదారులకు మొత్తం రూ. 33,03,828 విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా అందజేశారు. ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం ప్రభుత్వం రూ. 1,00,116 చొప్పున ఆర్థిక సహాయం అందించి తమకు ఎంతో ఆసరాగా నిలిచిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. తమ కుటుంబాలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుకి, స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేద ఇంటికీ నేరుగా చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు నిరంతరం కృషి చేయాలని మంత్రి సూచించారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల తహశీల్దార్, రెవెన్యూ అధికారులు, పెద్ద ఎత్తున గ్రామీణులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 10 Aug 2026 | 08:04 PM IST
Tags: