మేడ్చల్ మల్కాజిగిరి: ప్రజలకు సులభతరమైన సేవలను అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను, ఫిజికల్‌గా కాకుండా డిజిటల్ రూపంలో కూడా ఇంట్లోని మహిళల పేరు మీదే అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి స్పష్టం చేశారు. శామీర్ పేట్ మండలంలోని అంతాయిపల్లిలో గల ఎస్ఎన్ఆర్ వేద్ కన్వెన్షన్ హాల్‌లో జిల్లా సరఫరాల శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మను చౌదరి లబ్ధిదారులకు స్వయంగా కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామం, మున్సిపాలిటీలో వార్డు స్థాయి సభలు నిర్వహించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ పథకాలను చేరువ చేస్తున్నామన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఇప్పటివరకు 1,39,622 కొత్త రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రతి నెలా సుమారు 14 నుంచి 15 వేల టన్నుల సన్న బియ్యం పంపిణీ జరుగుతోందని, రెసిడెన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో కూడా విద్యార్థులకు కామన్ డైట్ మెనూ ద్వారా సన్న బియ్యంతో పౌష్టికాహారం అందిస్తున్నామని పేర్కొన్నారు.

స్మార్ట్ రేషన్ కార్డుల ప్రత్యేకతలను వివరిస్తూ.. కార్డు ముందు భాగంలో రేషన్ కార్డు నంబరు, పేరు, రేషన్ షాపు నంబరు ఉంటాయని, వెనుక భాగంలో మండలం, జిల్లా, రాష్ట్ర చిరునామాతో పాటు క్యూఆర్ కోడ్ (QR Code) ఉంటుందని తెలిపారు. మొబైల్ ఫోన్‌లో 'టీ-రేషన్' (T-Ration) యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు, తీసుకున్న సరుకుల సమాచారం, రేషన్ షాప్ వివరాలు సులభంగా తెలుసుకోవచ్చన్నారు. ఫిజికల్ రేషన్ కార్డు అందుబాటులో లేనప్పుడు మొబైల్‌లోని డిజిటల్ కార్డు ద్వారా కూడా రేషన్ సరుకులు పొందవచ్చని వెల్లడించారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ ఛైర్మన్ నర్సింహులు యాదవ్, గ్రంథాలయ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీఏ కమిటీ సభ్యులు జైపాల్ రెడ్డి, టీజీఎల్‌డీఏ ఛైర్మన్ చరణ్ కౌషిక్, ఎల్లంపేట్, అలియాబాద్, మూడుచింతలపల్లి మున్సిపల్ ఛైర్మన్లు, కీసర ఆర్డీఓ వెంకట్ రెడ్డి, తహశీల్దార్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 15 Aug 2026 | 09:24 PM IST
Tags: