ములుగు: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) స్వయంగా పరిశీలించారు. మేడారం నుండి ములుగు వరకు సాగిన ఈ పరిశీలనలో ఆమె వెంట మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు తదితర అధికారులు ఉన్నారు.
ఈ సందర్భంగా మేడారం, ములుగు ప్రాంతాల్లో జరుగుతున్న తుది ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క అధికారులకు తగు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను సమన్వయంతో పూర్తి చేయాలని ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ మరియు ఇతర సౌకర్యాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న రూ. 16,007 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పార్టీ శ్రేణులు, అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని మంత్రి కోరారు.


