మహేశ్వరం: పోలీసు అమరవీరుల వారోత్సవాలు, పోలీస్ ఫ్లాగ్ డే వీక్ సందర్భాన్ని పురస్కరించుకుని మహేశ్వరం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ హాల్‌లో విద్యార్థులకు వినూత్న రీతిలో వ్యాసరచన పోటీలను నిర్వహించారు. డీజీపీ సీవీ ఆనంద్, ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషిల సూచనల మేరకు, మహేశ్వరం ఫ్యూచర్ సిటీ డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ జానకి రెడ్డిల మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎస్‌హెచ్‌ఓ రాఘవేందర్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌ఓ రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, సోషల్ మీడియా దుర్వినియోగం అరికట్టడం, మాదకద్రవ్య రహిత తెలంగాణ నిర్మాణంలో విద్యార్థుల కీలక పాత్ర వంటి సమకాలీన అంశాలపై ఈ పోటీలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాల, మోడల్ స్కూల్‌తో పాటు శ్రీ చైతన్య, అక్షర విద్యాసంస్థలకు చెందిన 1,000 మందికి పైగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ఆలోచనలను వ్యాసాల రూపంలో పంచుకున్నారని పేర్కొన్నారు.

inline-img

పోలీసు అమరవీరుల అత్యున్నత త్యాగాలను స్మరించుకోవడంతో పాటు విద్యార్థులు, యువతలో సామాజిక బాధ్యత, వ్యక్తిగత భద్రతపై స్పష్టమైన అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఎస్‌హెచ్‌ఓ వివరించారు. విద్యార్థులు మాదకద్రవ్యాల భారిన పడకుండా దూరంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని మహేశ్వరం పోలీసులు పిలుపునిచ్చారు. ఈ భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన వివిధ విద్యాసంస్థల యాజమాన్యాలకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు మారయ్య, ప్రసాద్, ధనుంజయ్, ఏఎస్సైలు శ్రీనివాస్ రెడ్డి, రాంలాల్, పోలీసు సిబ్బంది, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 27 Oct 2026 | 09:50 PM IST
Tags: