ఆమనగల్లు: పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని అమనగల్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అరబిందో హైస్కూల్‌కు చెందిన సుమారు 100 మంది విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ సంతోష్ రెడ్డి, ఏఎస్‌ఐ రామ్ రెడ్డి, పోలీస్ సిబ్బంది విద్యార్థులకు పోలీసుల రోజువారీ విధులు, పోలీస్ స్టేషన్ నిర్వహణ విధానం, నేరాల నియంత్రణలో పోలీసులు ఉపయోగించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి వివరంగా తెలియజేశారు. స్టేషన్‌లోని వివిధ విభాగాలను విద్యార్థులకు చూపించి వారి సందేహాలను నివృత్తి చేశారు.
అలాగే, అక్టోబర్ 21న నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ ప్రాముఖ్యతను వివరిస్తూ.. దేశ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు, త్యాగాలను విద్యార్థులకు వివరించారు. ఇలాంటి విజ్ఞానదాయక కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో చట్టాల పట్ల గౌరవం, సామాజిక బాధ్యత పెంపొందడంతో పాటు పోలీసుల పట్ల సద్భావన కలుగుతుందని అమనగల్ పోలీసులు పేర్కొన్నారు.


