ఆమనగల్లు: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ భారీ వైద్య ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) ఎంతో అండగా నిలుస్తుందని కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. ఆమనగల్లు పట్టణంలోని తన నివాసంలో తలకొండపల్లి మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు మంగళవారం ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. నిరుపేదలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా సరైన వైద్య చికిత్స పొందలేక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం కొండంత భరోసానిస్తుందని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన ఈ సహాయాన్ని లబ్ధిదారులు తమ వైద్య అవసరాల కోసం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజల ఆరోగ్య భద్రత, సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం నుంచి తగిన సాయం అందేలా నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్‌తో పాటు వివిధ మండలాలకు చెందిన ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బాధిత కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్లిష్ట సమయంలో తమకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక భరోసా కల్పించినందుకు లబ్ధిదారులు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 27 Oct 2026 | 09:53 PM IST
Tags: