తలకొండపల్లి: రానున్న 'పాలమూరు–రంగారెడ్డి–హైదరాబాద్' పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో, ఐక్యంగా శ్రమించాలని నాగర్‌కర్నూల్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, తలకొండపల్లి మండల ఇన్‌ఛార్జ్ గోరేటి నరసింహ పిలుపునిచ్చారు. మంగళవారం తలకొండపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు నీలకంఠ పాండు నేతృత్వంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా గోరేటి నరసింహ మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదుకు నవంబర్ 6వ తేదీయే చివరి గడువు అని గుర్తుచేశారు. అర్హులైన పట్టభద్రులందరూ గడువులోగా తమ ఓటు హక్కును తప్పనిసరిగా నమోదు చేసుకునేలా నాయకులు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ఓటరు నమోదు ప్రాధాన్యతను వివరిస్తూ బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక వీడియోలను రూపొందించి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.

inline-img

దేశ ప్రధాని నరేంద్ర మోదీ దేశాభివృద్ధి కోసం అందిస్తున్న సేవలను, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిదేశం చేశారు. అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్‌ను ఓటరుగా చేర్పించడంలో ప్రతి కార్యకర్త క్రియాశీలక పాత్ర పోషించాలని, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగిరేలా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ఆయన పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 27 Oct 2026 | 09:56 PM IST
Tags: